PDS రైస్ మీద ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం :3840 కోట్లు ప్రతి ఏడాది ఆదా చెయ్యడానికి అవకాశం.
"గౌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకు నమస్కారించి వ్రాయునది.
ఆర్యా!
విషయం: PDS ద్వారా రైతులకు బియ్యం - సాలీన 3840 కోట్ల రూపాయల ఆదా - సంబందించి
ఉత్తరాంధ్ర (గోదావరి మరియు బహుదా నదుల మధ్య ప్రాంతం) అభివృద్ధి కోసం పనిచేయడానికి నేను 2019 లో నా ఐఆర్ఎస్ ఉద్యోగం నుండి వీఆర్ తీసుకున్నాను. నేను శ్రీకాకుళం (జన సేన 2019), విశాఖపట్నం (స్వతంత్ర 2024) పార్లమెంటరీ నియోజకవర్గాల నుండి ఎన్నికలలో పోటీ చేశాను. నేను శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామంలో జన్మించి, మొదటి పదిహేను సంవత్సరాలు అక్కడే గడిపాను. తరువాత నేను సివిల్ సర్వీస్ ఉద్యోగ వ్యవధిలో ప్రతి సంవత్సరం 3-4 సార్లు నా కుటుంబంతో కలిసి గ్రామాన్ని సందర్శించేవాడిని. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో మా గ్రామంలో వున్నాను. ప్రజల సమస్యల గురించి తెలుసిన వ్యక్తిగా, ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ను పునరుద్ధరించమని ఈ ఉత్తరం ద్వారా తమరిని అభ్యర్థిస్తున్నాను, ముఖ్యంగా పిడిఎస్ కింద రైతులకు బియ్యం పంపిణీ విషయం.
2. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) ఈ దేశంలో లక్షలాది మందికి ఆహార ధాన్యాలు, చక్కెర, వంట నూనె, పప్పుధాన్యాలు మొదలైన వాటిని సరఫరా చేసి ఆకలి బాధ నుండి కాపాడి సహాయపడింది. ఇది ప్రపంచంలోని బలమైన సంక్షేమ వ్యవస్థలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దివంగత ఎన్‌టి రామారావు గారు ఎనభై దశకం ప్రారంభంలో సబ్సిడీ బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ప్రజలకు రోజువారీ నిత్యావసరాలను అందించే సమగ్ర వ్యవస్థగా అభివృద్ధి చెందింది. PDSను పునరుద్ధరించేటప్పుడు దాని గొప్ప ధ్యేయాన్ని గుర్తుంచుకోవాలి.
3. ఈ సంవత్సరం రైతుల నుండి అనేక లక్షల టన్నుల వరి ధాన్యాన్ని మద్దత్తు ధరనిచ్చి సేకరిస్తామని ప్రభుత్వం తరపున గౌరవ అమాత్యుల వారి (మంత్రి, ఆహారం, పౌర సామాగ్రి మరియు వినియోగదారుల వ్యవహారాల) ప్రకటనను పత్రికల్లో చదివాను. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)ను కూడా అదే మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బియ్యం కార్డు కలిగిన కుటుంబాలు ప్రతి నెలా 20-25 కిలోల బియ్యం పొందుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా గ్రామీణ మరియు వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ. చాలా మంది బియ్యం కార్డ్ కలిగిన వారు చిన్న లేదా సన్నకారు రైతులు. ఈ రైతులలో ఎక్కువ మంది వరి ధాన్యం పండిస్తారు. తాము పండించిన ధాన్యాన్ని విక్రయించే ముందు కుటుంబ వినియోగం కోసం కొంత భాగాన్ని పక్కన పెట్టారు. వరి ధాన్యం పండించే రైతులు తమకిచ్చిన పిడిఎస్ బియ్యాన్ని తినరు. దానిలో ఎక్కువ భాగం అమ్మబడుతుంది లేదా భిక్షలివ్వడానికి ఉపయోగించబడుతుంది. పిడిఎస్ బియ్యం దారి మళ్ళుతుందని పత్రికల్లో గగ్గోలు వింటున్నాము. దురదృష్టవశాత్తు PDS బియ్యం మల్లింపునకు గల మూల కారణంలోకి ఎవరు వెళ్ళలేదు. ఒక వైపు ప్రభుత్వం రైతుల నుండి క్వింటాల్ల్లో వరిధాన్యాన్ని సేకరిస్తుండగా, మరోవైపు అదే ప్రభుత్వం వరిని పండిస్తున్న ఇదే రైతులకు కిలోల్లో పిడిఎస్ రేషన్ బియ్యం ఇస్తోంది.
4. వరి/బియ్యం పండిస్తున్న రైతులకు ఇచ్చిన చాలా పిడిఎస్ బియ్యం మార్కెట్‌కు వెళుతుంది. దానిలో కొంత భాగం తిరిగి పిడిఎస్ వ్యవస్థలోకి వస్తుంది. కొంత మార్కెట్లో సన్న బియ్యం (రెండవ పాలిషింగ్ తరువాత) క్రింద అమ్మకం లేదా ఎగుమతి చేయబడుతుంది. గత ఏడాది కాకినాడ పోర్టులో పిడిఎస్ బియ్యం ఉన్న నౌకను ప్రభుత్వంలోని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు చూశాను. మిల్లర్లు/ఎఫ్‌సిఐ నుండి పిడిఎస్ కింద పంపిణీ చేయడానికి ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేస్తుంది (రూ .35/కిలో చొప్పున్న). రవాణా మరియు పంపిణీ ఖర్చులను జోడించిన తరువాత, బియ్యం కార్డ్ హోల్డర్ దగ్గరకు కిలో ధర రూ.40కి వస్తుంది. కార్డ్ హోల్డర్ కిలోకి ఒక రూపాయి చెల్లించడమో లేకా ఉచితంగా పొందడమో జరుగుతుంది. అంటే కార్డ్ హోల్డర్ పిడిఎస్ బియ్యాన్ని అతి తక్కువ మొత్తానికి పొందుతారు. అందువల్ల చాలా మంది రైతు కార్డ్ హోల్డర్లు పిడిఎస్ బియ్యాన్ని తక్కువ ధరకే మధ్యవర్తికి (రూ.15 నుండి 20/కిలో) విక్రయిస్తారు. కార్డ్ హోల్డర్లు 20 కిలోల పిడిఎస్ బియ్యాన్ని విక్రయించి రూ.300-400/- ప్రయోజనం పొందుతున్నామని భావిస్తున్నారు. అదే బియ్యం కోసం తమ ప్రభుత్వం రూ.800/- ఖర్చు చేస్తున్నట్లు వారికి తెలియదు. ఈ విధంగా కనీసం 50% ప్రజా డబ్బు మధ్యవర్తులు, ఓపెన్ మార్కెట్ ఆపరేటర్లు, మిల్లర్స్ మొదలైన అనర్హులుకి అందుతుంది.
5. ప్రభుత్వ నివేదికల ప్రకారం రాష్ట్రంలో 1.45 కోట్ల పిడిఎస్ కార్డులున్నాయి. వీటిలో కనీసం 80 లక్షల కార్డులు వరి ధాన్యం పండిస్తున్న రైతులకు సంబంధించినవి. కాబట్టి ఈ రైతులకు PDS బియ్యం పంపిణీ చెయ్యడం ద్వారా రూ .3840 కోట్లు (80 లక్షలు* రూ .400* 12 నెలలు) ప్రతి సంవత్సరం ఖజానాకు నష్టం చేకూరుతుంది. వరి ధాన్యం పండిస్తున్న రైతులకు PDS ద్వారా బియ్యం ఇచ్చే పద్దతి హేతువునకు వ్యతిరేకం. ఈ పద్దతిని పునః పరిశీలించాల్సిన అవసరం వుంది.. విధాన రూపకర్తలు ఇప్పటివరకు ఈ అనాలోచిత ప్రతికూల పరిణామాలను ఎందుకు పరిశీలించలేదో నాకు అర్థం కాలేదు. సంవత్సరానికి సుమారు రూ .3840 కోట్ల ప్రజల సొమ్ము మరొకరి జేబుకు అక్రమంగా వెళుతోంది. ఇది రైతుకు ప్రయోజనం చేకూర్చడం లేదు, వినియోగదారుడుకి లాభం లేదు.పన్ను చెల్లింపుదారునిపై భారం పడుతోంది.
6. పై సమర్పణల దృష్ట్యా, వరి ధాన్యం పండించే రైతులకు పిడిఎస్ బియ్యం ఇవ్వడం మానేయాలని నేను సూచిస్తున్నాను. PDS బియ్యానికి బదులుగా వారికి వంట నూనె, చక్కెర, పప్పులు, గుడ్లు, కూరగాయలు, ఎండు చేపలు మొదలైనవి 800 నుండి 1000/- విలువైన కుటుంబానికి (పిడిఎస్ బియ్యం యొక్క సమాన విలువ) ఇవ్వాలని సూచిస్తున్నాను. దీనివల్ల పిడిఎస్ ద్వారా పంపిణీ చేసే ఇతర వస్తువులకు రూ.3000 కోట్ల వరకు గిరాకీ పెరుగుతుంది. పప్పు ధాన్యాలు పండించేవారికి, గుడ్డ ఉత్పత్తిదార్లకు, నూనె గింజలు పండించే వారికి, చేపలు పట్టేవారికి, మొ. లాభం చేకూరుతుంది. మిగతా రైస్ కార్డు కలిగిన వారికి ముందులాగానే PDS బియ్యం పంపిణీ చెయ్యాలి.
7.PDS వ్యవస్థలో వున్న పై లోపాన్ని సవరించి సమర్థవంతమైన వ్యవస్థగా పునరుద్దరించడానికీ నా సలహాలను పరిశీలించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.
ఇట్లు
మీ
మెట్ట రామారావు, IRS (vrs)
ప్రజా విధాన పండితులు మరియు రాజకీయ నాయకులు"
Comments
Post a Comment