1. పెళ్ళి/శుభ కార్యానికి ముహూర్తం పెట్టామని, పెళ్ళి చేశామని దగ్గర బంధువులు మరియు స్నేహితుల నిర్యాణం సందర్భంగా వారి కుటుంబాలను పరామర్శ చెయ్యకపోవడం. కొత్త పోకడలు ఈ మధ్య వచ్చాయి. వీటికి శాస్త్ర ప్రామాణికం లేదు. హేతుభద్దత అసలే లేదు. ఈ పోకడను ప్రజలు వదిలివేసి తమ బంధు, మిత్రుల కష్ట కాలంలో పాలు పంచుకోవాలి. మరణం మనిషి జీవితానికి ఆఖరి మజిలీ. నిత్య సత్యం. దేవుని నిర్ణయం అని ఎక్కవ మంది నమ్ముతారు. మరి అటువంటి సత్యాన్ని, దైవ ఆజ్ఞను అశుభం ఎలా అనుకుంటాం. పుట్టుక, చావు రెండు ఒకే నాణానికి రెండు వైపులు.
2. చావు పరామర్శకు ఆదివారం వెళ్ళకూడదట! ఎందుకు అంటే కారణం చెప్పరు. హేతుబద్దత తెలియజేయరు. సెలవు దినం కాబట్టి అత్యంత సులువైన రోజు ఆదివారం.బంధు మిత్రులను వారి కష్ట కాలంలో కలవడానికి ముహూర్తం అవసరమా?
3. పరామర్శకు వెళ్తే స్నానం చెయ్యాలని ఇంటివరకు వచ్చి ఆప్తులను కలవని సందర్భాలు చూశాను. శవ యాత్రలో పాల్గొంటే స్నానం చెయ్యాలి. చాలా మంది వ్యక్తులు వుంటారు కనుక. ఇతర రోజుల్లో ఇంటికి వచ్చి పరామర్శ చేసేటప్పుడుస్నానం అవసరం ఏంటి? శానిటేషన్ బాగా వున్న ఈ రోజుల్లో అవసరమా? ఇప్పుడు షామియానాలు, కుర్చీలు, sealed water bottles, disposable టీ ఇస్తున్న రోజుల్లో స్నానం అవసరం ఏంటి? ఆ బహనా చూపించి దుఃఖంలో వున్న బంధువులను కలవకపోవడమేంటి?
4. ఆడంబరంగా "ప్రధమ రజస్వల " ఉత్సవాలు. పాత రోజుల్లో బాలికలు 12/13 సంవత్సరాలకు యుక్త వయసుకు వచ్చేవారు. ఆ సందర్భంగా ఒక ఉత్సవం పెట్టి బంధువులకు తెలియజేసేవారు 'మా అమ్మాయి పెళ్ళి ఈడుకి వచ్చిందని '. రవాణా, టెలిఫోన్, ఇంటర్నెట్ లేని కాలం. శాంతి భద్రతలు కొద్దిమాత్రం వుండి వివాహం మహిళకు భద్రత అనే భావన వున్న రోజులవి. ఇప్పుడు పోషకహారం లభ్యత వల్ల బాలికలు 9/10 సంవత్సరాలకు రజస్వల అవుతున్నారు. విద్య, ఉద్యోగం, భద్రత మొ. కారణంగా వివాహం అన్నది 21-25 ఏళ్లకి అవుతుంది. " ఈ రజస్వల ఉత్సవం పెట్టడానికి హెట్టుబద్దమైన కారణం లేదు. పూజలాంటిది చెయ్యాలంటే ఆడంబరం అవసరం లేదు. పేద, ధనిక బేధం లేకుండా లక్షలు ఖర్చు పెడుతున్నారు. పేద వారు అప్పులు పాలవుతున్నారు. 5/6 తరగతి బాలికకు నీవు మహిళవు అని ముద్ర వేసి ఆంక్షలు విధిస్తున్నారు. చదువు కోసం పొదుపు చెయ్యాల్సిన డబ్బుని ఆడంబరం కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో, రాజకీయాల్లో, కంపెనీ బోర్డు రూముల్లో మహిళల సంఖ్య గణ నీయంగా పెరగాల్సిన సమయంలో మనం పనికిరాని వాటిపై ఖర్చు చేస్తున్నాం. ఇది మానుకోవాలి.
మా ఇంట్లో పెళ్ళి చేశాం. మేము బంధువుల, మిత్రుల శోక సమయంలో వారికి అండగా వుంటున్నాం.
నేను "రజస్వల " ఉత్సవాలకు వెళ్ళను. వాటిని నా రాజకీయ లబ్ధి కోసం వేదికగా వాడుకోను. అలాంటి వాటికి నన్ను ఆహ్వానించవద్దంటాను
ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే హేతుబద్ధం కాని, శాస్త్ర ప్రమాణం లేని వాటిని పాటించకూడదని ప్రజలను కోరుకుంటున్నాను.
ధన్యవాదములు 🌹
మెట్ట రామారావు, IRS (vrs)
Comments
Post a Comment